ఈ పుస్తక సృష్టికర్త –టెడ్ అగాన్
మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లాను. అక్కడ నాకు బాగా నచ్చిన విషయం గ్రంథాలయాలు.
డల్లాస్ లోని కేంద్ర గ్రంథాలయానికి వెళ్లాను. అక్కడ ఏటా రెండుసార్లు, వారం పాటు, ప్రత్యేక పుస్తక ప్రదర్శన, అమ్మకాలు చేస్తుంటారు. నేను వెళ్లినపుడు ఆ ప్రదర్శన జరుగుతుంది, అందులో The Human Key అనే పుస్తకం కనిపించింది. దానిలో ఒక పేజీ మధ్యలో ఈ సూక్తి కనపడింది.
Those who don’t learn don’t question. .
Those who don’t question don’t learn. .
ఆ మాటలు నన్ను ఆకర్షించాయి. పుస్తకాన్ని పరిశీలించాను.
అది టెడ్ అగాన్ రాసినది. మణిపూసల వంటి సూక్తులతో కూర్చిన మాలలా ఉంది.
ప్రశ్నించటం యొక్క ఆవశ్యకత, అది మానవప్రగతికి ఎలా మూలం అయిందో వివరిస్తూ. ఆధునిక మానవుడు ఇవాళ ఇలా ఉన్నాడంటే అది ప్రశ్నించుకోవటం వల్లనే సాధ్యం అయింది అనీ టెడ్ ఆగన్ సోదాహరణంగా వివరించాడు.
కొన్నాళ్లు పుస్తకం పైపైన చూశాక రచయితకు ఫోన్ చేశాను. ఆ పుస్తకం బాగుంది. దానిని తెలుగులోకి అనువదించుకోవటానికి అనుమతి అడిగాను. గంటకు పైగా చాలా ప్రశ్నలు వేశాడు. నా జవాబులతో సంతృప్తి చెందిన పిమ్మట సంతోషంగా ఆమోదించారు. కొన్ని దఫాలుగా దానిని గురించి మాట్లాడు కున్నాం. మళ్లీ ఆయనను కలుసుకోవటం కష్టం కనుక న్యూజెర్సీ నుంచి హ్యూస్టన్ వెళ్లి ఆయనను కలిశాను. ఒక రోజు ఇద్దరం కలసి గడిపాం. ఫైలు మొత్తం ఇచ్చారు. ఆయనతో సంబంధాలు కొనసాగుతున్నాయి.
– పెద్ది సాంబశివరావు

