భాష నిలకడగా ఉన్న నీటిగుంట కాదు, అది సతతం ప్రవహించే నది. మాతృభాష కాక ఎన్ని భాషలను అదనంగా నేర్చుకుంటే ఉద్యోగఅవకాశాలు అంతగా అధికం అవుతాయి. అయితే కనీసం ఐదేళ్లకొకసారయినా నిఘంటువును నవీకరించడం అవసరం. కాని మన తెలుగువారము వందేళ్లకు ముందు కూర్చబడి, నవీకరణకు నోచుకోని భాషా నిఘంటువులతో కాలం గడుపుతున్నాం. ఇక శాస్త్ర, సాంకేతిక రంగ నిఘంటువుల్లో ప్రగతి నామమాత్రమే. కాబట్టి వివిధ స్థాయిలలో భాషలు/శాస్త్రాలు/ సాంకేతిక రంగాలలో ఉన్నత ప్రమాణాలతో నిఘంటువుల ప్రచురణను విశాలాంధ్ర సంస్థ ద్వారా ప్రారంభించాము.
భావవ్యక్తీకరణకు భాష అవసరం. ప్రపంచంలో లిపి కలిగిన భాషలు ఆరువేలకు పైగా ఉన్నాయి.భారతదేశానికి హిందీ రాజభాష. ఇంగ్లిష్ అంతర్జాతీయ భాష. మరో 23 భాషలు రాజ్యాంగంలో గుర్తింపు కలిగినవి ఉన్నాయి. భాషావికాసంలో నిఘంటువులు కీలక పాత్ర పోషిస్తాయి. సాంకేతిక చదువులలో మంచి మార్కులు సాధిస్తున్న తెలుగు విద్యార్థులు ఇంగ్లిష్/ తెలుగులలో చిన్న వాక్యాలు కూడా చెప్పలేక, భావవ్యక్తీకరణ చేయలేక ఉద్యోగ అవకాశాలు పొందలేక పోతున్నారు. భాషావికాసానికి శబ్దకోశాలు అవసరం.
ప్రస్తుతం భాషానిఘంటువుల్లో వ్యాకరణ అంశాలు (grammar) తరచుగా దొర్లే తప్పులు (common errors), జాతీయలాలు (idioms), ముఖ్య పదాలు (frequently used words), మిత్రపదాలు (collocations), వాడకం(usage), సారూప్యపదాలు(synonyms), పదబంధాలు (phrases), వ్యతిరేక పదాలు (antonyms), వాక్యాలు (sentences)- అనువాదవాక్యాలు (translations) వంటి పలుప్రయోజనకర అంశాలను చేరుస్తున్నారు. అటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో మాతృభాష, దేశభాష, అంతర్జాతీయ భాషలను నేర్చుకోవడానికి వీలుగా ఈ తెలుగు, ఇంగ్లిష్, హిందీ త్రిభాషా నిఘంటువు తయారు చేయబడింది.
ఇది ప్రస్తుత అవసరాలకు తగినది. దీనిని ప్రొఫెసరు డా.పి. హరిపద్మరాణి గారు సంకలనం చేశారు.

